Thursday, December 18, 2025

అమరావతి TO అమరావతి BY అమరావతి

 


సరిగ్గా 43 ఏళ్ల క్రిందట ఇదే రోజు (18th Sep 82) మా ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెషర్స్ డే జరిగింది. అలనాటి ర్యాగింగ్ మెమరీస్ ను గుర్తు తెచ్చుకుంటూ , ఐదేళ్ల  కిందట కరోనా కష్టకాలంలో  - రాసిన  రచన.  కాస్త సుత్తిమెత్తంగా 👇


అమరావతి TO అమరావతి BY అమరావతి


అవి నూనూగు మీసాల తో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. దాని తర్వాత బీఎస్సీ డిగ్రీలో ఏమి group తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయం. Degree లో నా కిష్టమైన group Maths, Political Science, Psychology (మా ఫ్రెండ్  దీన్నే దబాయింపుగ పిసికాలజీ అని పలికేవాడు). మా నాన్నవి, నావి ఇలాంటి విషయాల్లో అభిప్రాయాలు బాగా కలుస్తాయి. కాని ఆ combination లో మా ఊళ్ళో (దరిదాపుల్లో) ఏ కాలేజీలోనూ group లేదు.  ఇక తప్పక మా ఇంటా వంటా లేని Professional Course కోసం entrance prepare అవ్వాల్సి వచ్చింది.

CET లో ర్యాంకు వచ్చింది. 

తెనాలి నుంచి Hyderabad కౌన్సిలింగ్ కి ఒంటరిగా బయలుదేరాను.

వెళ్తున్నప్పుడే  నాన్న సీట్ సెలక్షన్ కి కండిషన్స్ పెట్టి పంపించారు. ఎట్టి పరిస్థితులలోనూ జే. ఎన్. యు. అడ్డా (సారీ, వరంగల్  REC) సెలెక్ట్ చేసుకోకూడదు.  ఇక ఆ పై  రాయలసీమ, తెలంగాణ వద్దు.  సో మిగిలింది కాకినాడ, వైజాగ్, Consolation allowed is తిరుపతి.

మన పర్సనాలిటీ ప్రకారం మెకానికల్ కూడదు.  సివిల్ అసలే వద్దు. ఈ conditions మీద Hyderabad కి బయలుదేరాను.

కౌన్సిలింగ్  లో నా వంతు వచ్చేసరికి ఫ్రెష్ గా JNTU కాకినాడ ఎలక్ట్రికల్ quota ఓపెన్  అయింది (Andhra Local quota).  

నా ర్యాంకు తర్వాత  ర్యాంకు శంకరశాస్త్రి గారి  మనవడిది. నిజంగానే శంకరాభరణం సోమయాజులు గారి మనవడిది. నేను ఆలోచిస్తుంటే అక్కడున్న ఆఫీసర్స్ తొందరగా సెలెక్ట్ చేసుకో వయ్యా. లేకపోతే ఆయన “శంకరా నాదశరీరాపరా….” అని గానామృతాన్ని స్టార్ట్ చేశారంటే మనమందరం కరిగిపోతాం  అన్నారు.  శంకర శాస్త్రి గారు మాత్రం పోనీలే పాపడుని టైం తీసుకోని అన్నారు.

మెకానికల్ కానీ, ఈ సి ఈ కానీ ఏమైనా ఉన్నాయేమో అని ఎంక్వయిరీ చేద్దామంటే ఆఫీసర్స్ తొందర పెట్టేస్తున్నారు. సో కాకినాడ ఎలక్ట్రికల్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నా (నేనే బోణి కాబోలు). అంటే దాదాపుగా యూనివర్సిటీ బ్రాంచ్ టాపర్ లాగా అన్నమాట.


ఇక తెనాలికి వచ్చేసాను.  కాకినాడ కాబట్టి అందరూ హ్యాపీస్. సెప్టెంబర్ ఫస్ట్ కి జాయిన్ అవ్వాల్సిన సమయం దగ్గర పడుతోంది. నాన్న నన్ను as usual ఒక్కడిని college కి పంపడానికి prepare చేశారు. బయలు దేరే రోజు వచ్చింది.

అప్పగింతల నాడు ఏడ్చే పెళ్లి కూతురు లాగా ఉంది పరిస్థితి. నా ఏడుపు + అమ్మ ఏడుపు.  ఆ మాటకి వస్తే నాకు రెండు మూడు campus to home ట్రిప్పులు పట్టింది అప్పగింతల ప్రహసనం నార్మల్ అవటానికి. ఇప్పటికీ నాకు ఎవరి పెళ్లి లో అయినా ఏ ఆడకూతురి అప్పగింతలు  అయినా చూస్తే కళ్ళ వెంట  నీరు వస్తుంది (ఇంక్లూడింగ్ నా own పెళ్లిలో). Added to that  సన్నాయి to the occasion makes more emotional.

తెనాలి నుంచి నాన్న నన్ను గుంటూరు స్టేషన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించారు. నాన్న "నువ్వు కావాలని కోరుకున్న course.... నువ్వే స్వతంత్రంగా decisions తీసుకుంటున్నావు కదా...." అంటూ తిడుతూ సాగనంపారు.  నా లగేజ్ ఒక హోల్డర్, ఒక ట్రంకు పెట్టె బారిస్టర్ పార్వతీశం లాగ. సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది passenger ట్రైన్ - ఢుగు ఢుగు ఢుగు… మని. 

మధ్య లో Train మారి destination చేరేసరికి  ఒక జీవిత కాలం లేటుగా మరునాడు ఉదయం అయ్యింది.


Campus చేరేసరికి 10:00 .

క్యాంపస్ చూస్తే ఒక ఎడారి లాగా అనిపించింది. మెయిన్ entrance కి బిల్డింగ్ కి చాలా డిస్టెన్స్ ఉన్నది. ఇంత లగేజీ తో ఎలాగా అనుకుంటూ ఉంటే, ఇంతలో నలుగురు గళ్ళ లుంగీ తో టీ షర్ట్ వేసుకుని పక్కన ఉన్న టీ బంకు నుంచి వచ్చి నుంచున్నారు. వాళ్ళని చూస్తే పక్కా రాటుదేలిన  రాయలసీమ రౌడీల్లా (RRR) ఉన్నారు.

వాళ్ళల్లో ఒకడు 

(సమరసిమ్హా) : ఫ్రెషర్ వా?  అని అడిగాడు. 

దాని అర్థం తెలియక తెల్లమొహం వేసుకుని నుంచున్నాను.

ఇంకొకడు 

(ఆదికేశవలు): అదేరా కొత్తగా జాయిన్ అవ్వటానికి వచ్చావా? అని అడిగాడు. 

అవును అన్నాను. 

ఇంకొకడు

(ఇంద్రసేన):   ఏ ఊరు అని అడిగాడు? 

తెనాలి అన్నాను. 

“మీది తెనాలి - మాది తెనాలి" అని డాన్స్ చేసాడు నాలుగో వాడు. 

బహుశా వాడి దగ్గర చిన్ని కృష్ణ Assistant గా చేరుంటాడు రాబోయే కాలంలో.  

“ఏంటి బె తెనాలి ! Respect ఇవ్వవ? మాట్లాడె  ముందూ వెనక ఏమి చేర్చవా. ” అని అన్నారు గుంపుగా. 

దాంతో నేను  “నాది తెనాలి అండి” అన్నాను. 

వాడు నువ్వేమన్నా “మా ఆవిడవా? అండి అనటానికి. సర్ అను” అని హూంక రించాడు.

“బక్కొడివి నువ్వేమి మోస్తావులే కాని” అంటూ

ఆ నలుగురు నా లగేజీ పట్టుకుపోయారు. 

ఓరి వీళ్ళు కూలీలా! నేను ఇంకా సీనియర్స్ అనుకున్నానే అని మనసులో స్వగతం. 


వాళ్ళు నన్ను అడ్మిషన్స్ అవుతున్న Main బిల్డింగ్ కి తీసుకువెళ్లారు.  లోపలికి వెళ్లేముందు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు NB హాస్టల్ సెలెక్ట్ చేసుకోమని. 

ఇంతలో ఇంకో గ్రూప్ వచ్చింది. 

“ఏంట్రా ఈ బకరాని పట్టుకొచ్చారు మేము బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చే లోపల”.

“అరేయ్ బకరా ! నువ్వు YB హాస్టల్ సెలెక్ట్ చేసుకో అన్నారు నా కేసి చూస్తూ. 

ఇంతలోకి ఇంకా పెద్ద గ్యాంగ్ వచ్చి, నో వే. OC సెలెక్ట్ చేసుకో అన్నారు.

ఇదేమి గోల రా బాబు  అనుకుంటుంటే వాళ్లను అడిగాను వాటి అర్థాలు ఏమిటని. 

NB అంటే నరక భవనం, YB అంటే యమ భవనం అని.  ఓ సి అంటే ఇంకేముంది ఉరికంభం అని అర్థమైంది.

ఇంతలోకి వార్డెన్ అనుకుంటా వచ్చినట్లున్నారు. నన్ను లోపలికి రమ్మన్నారు. ఆయన్ని Seniors TB అని పీలుస్తున్నారు low pitch లో.

తరువాత తెలిసింది TB అంటే Nick name అని (Tuppu Belt).  పాపం ఇప్పుడు ఆయన బెల్టు బాగానే ఉంటోంది. కానీ ఆయన  చేరిన కొత్తల్లో తుప్పు పట్టిన బెల్టు పెట్టుకొని క్లాసుకి వచ్చారుట. అందుకని ఆ నామధేయము. 

ఇది తలుచుకుంటే నాకు ఒక డౌటు వస్తున్నది. మన భీమవరం బుల్లోడు మరి మొదటిరోజు క్లాస్ కి ఎలా వెళ్ళాడో కదా అని. కానీ  మన డాక్టర్ చక్కగానే ఉంటాడులే. He must have tied, tucked, belted, suited and booted. Good but what about Wigged? (నేను మాత్రం Degree తరువాతి కాలం లో వెలగబెట్టిన 4 months lecturer గిరి లో జాగ్రత్తగానే care తీసుకున్నాను).


ఆ విషయం పక్కన పెడితే ఫార్మాలిటీస్ అన్ని కానిచ్చేసి NB alot చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటుం దాన్ని బట్టి నాకు అర్థమైంది అది న్యూ బ్లాక్ అని. YB అంటే ఎల్లో బ్లాక్. OC అంటే ఓల్డ్ క్యాంపస్ అని.  బయటికి వచ్చేసరికి నా గ్యాంగ్ అలాగే ఉంది. లగేజిని చక్కగా నరక భవనం దాకా మోసుకుని వచ్ఛారు. దారిలో అజంతా హాస్టల్ ఉరఫ్ YB కనబడ్డది. ఫైనల్ గా మా NB అమరావతి హాస్టల్ దర్శనమిచ్చింది.

అప్పటికే హాస్టల్ ముందు ఆకలిగొన్న పులులు, సింహాలు చాలానే ఉన్నాయి. నా కూలీలు లగేజ్ ని రూమ్ కి చేర వేశారు. నేను మాత్రం Room కి చేర వేయబడలేదు. పులులు సింహాలు నాతో  ఓ గంట ఆటలు ఆడుకున్నాయి.  ఇంతలోకి నా రూమ్మేట్స్  లో ఒకరు (కామేశ్వరరావు - personality Village లో వినాయకుడు) వచ్చి నన్ను  తీసుకుని వెళ్లాడు. రూములు ఖాళీ లేకపోవడంతో ముగ్గురు ఉండాల్సిన  రూములో 4వ వాడిగా ప్రెషర్ ని వేశారు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అందరూ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు అని. మిగతా ఇద్దరు లో ఒకతను నెక్స్ట్ డోర్ అబ్బాయిలాగా ఉన్నాడు చక్కగా (పేరుకూడా చాలా జనరల్ గా శ్రీనివాస రావు). ఇంకొకతను జీనియస్ లాగా గడ్డం పెంచి కామ్ గా కనిపించాడు. అతని పేరు మధుసూదన్. నాకోసం రెండు టేబుల్స్ తో ఒక bed లాగా అరేంజ్ చేసారు. అచ్చంగా ఆపరేషన్ టేబుల్ లాగా అనిపించింది. 


మొదటిరోజు హుషారుగా క్లాస్ కి అటెండ్ అయ్యాం. ఫస్ట్ బెంచీలో కూర్చున్నా. మా నాన్న, చిన్నక్క ఆశయం నేను ఐ ఏ ఎస్ అవ్వాలని. మరీ  అంత ఐ ఏ ఎస్ , ఐ ఎఫ్ ఎస్ కాక పోయినా ఏదో ఐ ఈ ఎస్ అవ్వాలని ఆత్రంగా గా ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తున్నాను.

కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ పరిచయం చేసుకుంటున్నారు. ఎవరూ ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. అందరూ "ఏంది అన్నా! యాడ నుంచి వచ్చినావ్?" అంటున్నారు.  నాకు చాలా వింతగా ఉంది.

ఒక్కొక్కళ్ళు అంత ఎత్తున ఆరు అడుగులు, పొడుగ్గా ఉండి అన్నా అంటుంటే తిక్కగా అనిపించింది.  మొదటి రోజు కాబట్టి క్లాసులో చాలా కొద్ది మందే ఉన్నారు. 25 మంది కూడా లేరేమో.

ఫిజిక్స్ ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారు వచ్చారు. ఆయన తన ఇంట్రడక్షన్ కానిచ్ఛి ఇంటర్మీడియట్ రివ్యూ లాగా స్టార్ట్ చేశారు.

ఆయన ఇంగ్లీష్ వింటుంటే హాలీవుడ్ సినిమా లాగా ఉంది. మా పరిస్థితి చూసి  ఆయన కి అనుమానం వచ్చి “మీలో ఎంతమంది ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం?” అని అడిగారు. దాదాపుగా 20 మంది దాకా తెలుగు మీడియం అన్నట్టుగా calm గా చేతులెత్త కుండా కూర్చున్నారు.

మిగతా వాళ్ళలో కూడా చాలామంది మొహమాటంగా చేతులెత్తారు. నేను ఒక్కడిని గొప్పగా చెయ్యి బాగా ఎత్తాను.

క్లాసు అంతా అయ్యేసరికి అర్థమైంది మన Knowledge కి  ఐ ఈ ఎస్ కాదు కానీ, సెంట్రల్ గవర్నమెంటో, పి ఎస్ యు నో చూసుకోవాలని. అది కూడా దేశ సేవే  కదా!.

ప్రొఫెసర్ గారు వెళ్ళిపోతుంటే అందరూ అడిగారు సర్ ఏ బుక్ ఫాలో అవ్వాలి అని. ఆయన వాజపేయి గారిలా నవ్వుతూ చెప్పారు. ఆ   ఆథర్స్  పేరు ఎవరికీ అర్థం కాలేదు అనుకుంట. అందరూ అనుమానంగా ఫేసు పెట్టేసరికి ,  “అదిగో ఆ ఇంగ్లీష్ మీడియం ని అడగండి చెప్తాడు” అని నన్ను చూపిస్తూ వెళ్లిపోయారు. ఎందుకంటే నేను ఒక్కడినే ఆయన క్లాసు శ్రద్ధ గా విన్నట్టు ఫేసు (act) పెట్టాను.  నేను వాళ్లకి చెప్పిన ఆథర్శ్ పేరు ఇప్పటికీ గుర్తుంది. 90% కరెక్ట్ గానే చెప్పానే.  కానీ ఎవడో మిత్రద్రోహి నేను చెప్పిన దాన్ని మార్చేసి (నేను చెప్పిన ఆదర్శ్ పేరు మార్చేసి) నామీద  నీలాపనిందలు మోపేసాడు.  హాస్టల్కెళ్ళేసరికి సీనియర్స్.  “Welcome to Rajanikanth” అంటూ, రజనికాంత్ పేరు తొ ఆ రోజంతా నన్ను full ragging. ( Physics book authors - Resnick and Halliday అని నేను చెబితే ఆ మిత్ర ద్రోహి  సీనియర్స్ కి నేను రజనీకాంత్ హాలిడే అని చెప్పానని కథ అల్లేసాడు)


ఈ మధ్యలో  త్రీ idiots టైపులో ఒక అర్ధరాత్రి 12 గంటలకు ఫ్రెషర్స్ అందరిని హాస్టల్లో అసెంబుల్ చేసి  మాస్ డ్రిల్ చేయిస్తున్నారు. దాని క్లైమాక్స్ Adam స్టేజ్ కి చేరడం. పైన కిటికీలోనుంచి చూస్తున్న నా సీనియర్ రూమ్మేట్స్ కిందకు దిగి వచ్చి నాకు సైగ చేసి పడిపోతున్నట్టు గా యాక్ట్ చెయ్యమన్నారు. నేను అలా యాక్ట్  చెయ్యగానే మా వినాయకుడు ఒరేయ్ వీడు అసలే బక్కోడు ఏదైనా అయితే మీ అందరికీ డేంజర్ అని పట్టుకు పోయాడు రూమ్ కి. 

మిగతా రోజులన్నీ ర్యాగింగ్ షరా మామూలే. సర్ అనే పదం మా దినచర్యలో ఎంతలాగా హత్తుకు పోయిందంటే  ఊళ్లో కి ఎప్పుడైనా సాయంత్రాలు బయటికి వెళ్లినప్పుడు హోటల్ సర్వర్నైనా, రిక్షావాడినైనా, అడుక్కునే వాడినైనా ఎవరినైనా సరే సర్ అనటం - వాళ్లు వింతగా చూడటం జరిగేది. 18 రోజుల పాటు ఈ ర్యాగింగ్ ప్రహసనం జరిగింది.

College, Hostel Mess, Toilets - Ragging కి Exception. అందుకే చాలామంది ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడే ఎక్కువ గడుపుతుంటారు.

 

చివరిగా ఎలక్యూషన్   Competition ఒక రోజు జరిగింది. Ragging ఉండాలా?  వద్దా?. నేను ఉండకూడదని మాట్లాడాను. Seniors judges. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సీనియర్స్ లగేజీ మోసుకుని రావటం ఎపిసోడ్ చెప్పటం వలన కావచ్చు. ఫ్రెషర్స్ డే ఫంక్షన్ నాడు stage మీద మాట్లాడాను -Freshers అందరిని represent చేస్తు.

అల Ragging కధ సుఖాంతం అయింది.

………….

ఇదంతా  చదువుతుంటే మీకు  ఆశ్చర్యంగా అనిపించవచ్చు.

ఇది ఏమి కాలేజీ? ఇదేమి క్యాంపస్? చందు ఏమన్నా  మతి తప్పి రాశాడా?  తప్ప తాగి చెత్త వాగుతున్నాడా? అజంతా, అమరావతి హాస్టల్ అని రాతి గుహల పేర్లు చెబుతున్నాడు ఏంటి? ఎంచక్కా నరేంద్ర, నాగార్జున, నలంద అని జ్ఞానభండాగారాల  హాస్టల్ పేర్లు ఉండంగా. కధలు అల్లుతున్నాడా?

కానీ నా గతం తెలిసిన కొంతమందికి అర్థం అవుతుంది. 

ఇది  అనంతపూరు క్యాంపస్ అని.


హైదరాబాద్ CET కౌన్సిలింగ్ లో సీట్స్ సెలక్షన్ అప్పుడు ఛాయిస్ ఇచ్చారు అప్గ్రేడ్ చేసుకోవచ్చని. అప్పుడు నేను ఎనీ బ్రాంచ్ అని రాశాను. కానీ ఎనీ క్యాంపస్ అని కూడా టిక్ చేశానని తెలియలేదు.

దాంతో  కాకినాడ ఎలక్ట్రికల్ లో చేరే ముందే అనంతపూర్ మెకానికల్ బ్రాంచ్ ఎలాట్ అయినట్టు ఉత్తరం వచ్చింది.  దాంతోపాటు మా నాన్న అక్షింతలు కూడా వచ్చిపడ్డాయి కాకినాడ పోగొట్టుకున్నందుకు. 

అనంతపూర్ college కి report చేయాల్సి వచ్చింది join అవ్వడానికి.

First year First semester తరువాత Anantapur నుంచి Kakinada Transfer అయ్యి వచ్చా.

So అమరావతి సీమ నుంచి అమరావతి Hostel దాక అమరావతి train  (నేను ప్రయాణించిన first train name to Anantapur ) ప్రయాణం తో సాగిన నిజ జీవితపు కథ ఇది





చంద్రశేఖర్ చన్నాప్రగడ

బెంగళూరు

జరిగినది - సెప్టెంబర్ 1982 

వ్రాసినది - సెప్టెంబర్ 2020 

మా అలుమ్ని వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేసినది - 18th సెప్టెంబర్ 2025

No comments:

Post a Comment