మా అపార్ట్మెంటిదైవం - సిద్ధి వినాయక
అందరికీ ఇంటి దైవం, ఇష్ట దైవం, కులదైవం, గ్రామ దేవత... ఉన్నట్టుగా మాకు అపార్ట్మెంట్ దైవం ఉన్నది. అదే మా అపార్ట్మెంట్ (మహావీర్ స్ప్రింగ్స్ ఎనెక్స్ - MSA) లోని సిద్ధి వినాయకుడు (80 ఇళ్ల వాళ్ళము - భక్తిగా పిలుచుకునే MSA వినాయకుడు).
దాదాపు 15 ఏళ్ల కిందట బిల్డింగ్ తో పాటు వెలసినది ఈ మందిరం. మా సిద్ధి వినాయకుడి గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. దాదాపు స్వయంభుగా వెలసిన వినాయకుడు అని మా అపార్ట్మెంట్ వాసులందరం గట్టిగా నమ్ముతాము. స్వయంభు అని ఆశ్చర్యపోకండి. ఈ అపార్ట్మెంట్ కట్టే ముందు - ఈ స్థలంలో శతాబ్దపు కాలపు పెద్ద రావి చెట్టు ఉంది (ఇప్పటికీ ఉంది). బిల్డింగ్ కట్టిన తర్వాత కొమ్మలు బిల్డింగ్ కి అడ్డం వస్తున్నాయని చాలా భాగాన్నే కొట్టేశారు. ఆ చెట్టు పక్కనే ఉన్న శివ శూలమును, శిలను మునీశ్వర దైవంగా కొలిచే ల్యాండ్ ఓనర్ ఫ్యామిలీ గొడవ చేసి - ఇది చాలా అశుభము అని హెచ్చరించేసరికి - అందరూ ఆ చెట్టుని కలుపుకుని ఒక మందిరాన్ని నిర్మించాలని సంకల్పించారు (మైనారిటీస్ తో సహా).
వినాయకుడి మందిరం కట్టడానికి ఏకగ్రీవ అంగీకారమయింది - ఒక్క తమిళ అయ్యంగార్ల కుటుంబాలు తప్పించి. శివ పరివారానికి మేము - పూజ చేయము విష్ణు పరివారానికి మాత్రమే చేస్తామని చెప్పి - ఇప్పటికీ వాళ్లు ఆ మందిరం వైపు కన్నెత్తే చూడరు. ఏ వినాయకుడి ఫంక్షన్స్ లోనూ పాల్గొనరు. మన తెలుగు వారికి ఇది వింతగా అనిపించవచ్చు గాని తమిళనాడులో కొన్ని కుటుంబాల్లో ఇది సర్వసాధారణం. శివకేశవులు అభేదమని ఇప్పటికీ వారు అంగీకరించరు.
కొన్ని అపార్ట్మెంట్లలో గుడి కట్టాలంటే దాదాపు అయోధ్య రామ జన్మభూమి పోరాటానికి మించి ఉంటుంది. కొంతమంది తెలివిగల లౌకికవాదులు (సూడో సెక్యులరిస్ట్స్) మేనేజ్మెంట్ కమిటీలో ఉంటే తెలివిగా ఒపీనియన్ పోల్ పెట్టి ఏ దేవుడి గుడి కట్టాలి? అని అడుగుతారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, దుర్గాదేవి, రాముడు, సాయిబాబా, సర్వధర్మ మందిరం ఇలా ఆప్షన్స్ లిస్ట్ అంతా పెంచుకుపోతారు. చివరికి ఏ ఒక్క ఆప్షన్ కి మెజారిటీ రాదు కాబట్టి, గుడి కట్టడం కుదరదు అని తేల్చేస్తారు. మా అపార్ట్మెంట్ కి ఆ దుస్థితి పట్టలేదు. గుడి కట్టిన తర్వాత ఆ గుడికి నామకరణం కూడా మెజారిటీ పద్ధతి ద్వారానే ఎటువంటి విజ్ఞాలు కలగకూడదనుకుంటూ, అనుకున్న కార్యక్రమాలు సిద్ధించాలని, సిద్ధి వినాయక అని నామకరణం చేశారు. అలా వెలిసినదే మా సిద్ధి వినాయక మందిరం.
మా సిద్ధి వినాయకుడికి ఆడిటర్ అబ్జెక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. గుడి పూజారి జీతము, గుడి ఖర్చులు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కలెక్షన్ నుంచి ఇవ్వకూడదని ఒకసారి, పర్లేదు ఇవ్వచ్చని ఇంకొకసారి - ఏజీఎం మీటింగ్లో పాస్ చేసి మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డ్ చేయమని చెప్పి - ఇలా ఆడిటర్ తనకు నచ్చిన, మెచ్చిన సలహాలు ఇస్తుంటారు. గుడికి వచ్చే హుండీ డబ్బులు గుడికే వాడాలని ఒకసారి - పూజారికి, గుడికి కావలసిన సామాగ్రి కమిటీయే ఇస్తుంది కాబట్టి హుండీ డబ్బులు అపార్ట్మెంట్ మెయింటినెన్స్ కి కూడా వాడొచ్చని ఇంకొకసారి ఆడిటర్ ఆదేశిస్తుంటారు.
మా గుడి పూజారి పేరు వినయ్ భట్, కానీ అందరికీ గణేష్ భట్టుగానే పరిచయం. దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉండే చిన్న అతను. ఇంకా పెళ్లి కాలేదు. ప్రతిరోజు శ్రద్ధగా ఉదయం జలాభిషేకం, క్షీరాభిషేకం, సాయంత్రం హారతి క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు భట్ గారు. కొండకచొ పంచామృత అభిషేకం - ఎవరైనా పుట్టిన రోజులు, పెళ్లి రోజులు ఉంటే ప్రత్యేకంగా చేయించుకుంటారు. ప్రత్యేక పర్వదినాలలో కూడా విశేష పూజలు జరుగుతుంటాయి.
బెంగళూరు చూడటానికి మా ఇళ్ళకి వచ్చే అతిధులకి మొట్టమొదటి టూరిస్ట్ స్పాట్ ఈ గుడే. ఈ గుడి నుంచే బెంగళూరు దర్శనం గానీ కర్ణాటక దర్శనం గానీ మొదలవుతుంది.
ప్రతినెలా జరిగే సంకష్ట చతుర్థి (సంకటహర చతుర్థి) , అలాగే వినాయక చవితి అంటే మా అపార్ట్మెంట్ వాసులకు ఒక పెద్ద పండగ. సంకష్ట చతుర్థి చిన్నప్పుడు నాకు అసలు తెలియదు. కానీ బెంగళూరు ఉద్యోగరీత్యా వచ్చిన దగ్గరనుంచి అది మా జీవితంలో ఒక ముఖ్యమైన తిధిలాగా (ఏకాదశి తిధి లాగా) అయింది. ప్రతినెలా జరిగే ఈ సంకష్ట చతుర్థి కి అపార్ట్మెంట్లో వాళ్లు ఎవరో ఒకళ్ళు స్పాన్సర్స్ గా ఉంటారు. పంచామృతానికి కావలసిన పదార్థాలు, పళ్ళు ,పూలు స్వీట్స్ ,ఉండ్రాళ్ళు ,జిల్లెడు కాయలు, నానబెట్టిన శనగలు, తిరగమాత పెట్టిన శనగలు, పూజా ద్రవ్యాలు అన్నీ ఆ స్పాన్సర్ పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు కూడా తమ వంతు కంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి స్పానర్స్ మధ్య కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎవరు చెయ్యాలి? అని. ఫస్ట్ కం ఫస్ట్ ఛాన్స్ అనే పద్ధతి ఫాలో అవుతారు. సంకష్ట చతుర్థి మంగళవారం నాడు గనుక వస్తే (అంగారక చతుర్థి) అది మరింత శుభప్రదమని , దానికి స్పాన్సర్ చేయటానికి చాలా మంది ముందుకొస్తుంటారు.
సంకష్ట చతుర్థి రోజు (నెలకి ఒక సారి - బహుళ చవితి - పౌర్ణమి తరువాతి చవితి) సాయంత్రం భక్తి పారవశ్యంతో గడిచిపోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 దాకా పూజా కార్యక్రమాలు సాగుతాయి. జలాభిషేకము, పంచామృత అభిషేకము, చక్కటి అలంకరణ, ఒక్కొక్కసారి చందన అలంకరణ, మహా మంగళ హారతి చాలా పద్ధతిగా మా పూజారి చేస్తారు.
దాదాపుగా 9:30 కి ప్రసాదం నైవేద్యంగా పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అప్పటికి సడన్ గా ఒక పది మంది శివాంశులు (పిల్లలు) బాల వినాయకుళ్ళు, బాలమురుగన్లు బిలబిలామని వచ్చేసి ఉండ్రాళ్ళు, పంచామృతాలు, ప్రసాదాలు అడిగిమరీ తిని సంతృప్తిగా వెళతారు.
మొదట్లో చాలామంది 10 గంటల దాకా వెయిట్ చేసి , ప్రసాదాలు తిని అప్పుడు ఇళ్ళకెళ్ళి ఉపవాసం ఉన్నవాళ్లు భోజనం చేసేవాళ్లు.
రాను రాను భక్తి పెరిగి నిర్వాణ స్టేజ్ కి లేదా ఆత్మను తెలుసుకొనటం ద్వారా - నాలాగా సాయంత్రం 6 గంటలకే భోజనం కానిచ్చె బాపతు భోజనం తర్వాతే - పూజా పునస్కారాలు చూసి తరించి , తీర్థప్రసాదాలు తీసుకోవటం జరుగుతున్నది.
వినాయక చతుర్థి అయితే, ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి, మట్టి వినాయకుడిని తీసుకుని వచ్చి, భక్తి శ్రద్ధలతో పూజ కానిచ్చి , ఇంటింటి నుంచి ఒక్కొక్క ఐటమ్ తయారు చేసుకుని , అందరూ కలిసి సామూహిక భోజనాలు కానివ్వటం ఒక ఆనవాయితీ. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా విన్యాసాల ప్రదర్శన (ఇవి స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ... నాడు కూడా జరుగుతాయి). సాయంత్రం పద్ధతిగా నిమజ్జనం చేయడం. ఖైరతాబాద్ వినాయకుడి లాగానే హడావిడి (కాకపోతే లడ్డు వేలం ఉండదు ఇక్కడ). అపార్ట్మెంట్లో మూడు ప్రదక్షిణాలు చేస్తూ, గణపతి బొప్పా మోరియా మంగళ మూర్తి మోరియా అంటూ నీళ్ల డ్రమ్ములో నిమజ్జనం చేయడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాము.
మా సిద్ధి వినాయకుడు ఎన్నో శుభకార్యాలకి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. పుట్టినరోజులకి , కొత్తగా పుట్టిన శిశువులకి ,పెళ్లిరోజులకి, కొత్తగా పెళ్లయిన జంటలకి ఆశీర్వచనాలు ఇవ్వటమే కాక ప్రత్యేక పర్వదినాలలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆశీర్వచనాలు తీసుకొనటం పరిపాటి. మందిరానికి ఎదురుగా ఉండే ప్స్విమ్మింగ్ పూల్ దగ్గర , అటుపక్క ఇటుపక్క జరిగే ఎన్నో అపార్ట్మెంట్ కార్యక్రమాలకి ప్రత్యక్ష సాక్షిగణపతిగా మా సిద్ధి వినాయకుడు వెలసిల్లి ఉన్నాడు. దసరాల నాడు దాండియా, దీపావళి చిచ్చుబుట్ల, తారాజువ్వల సెలబ్రేషన్స్ , హోలీ సెలబ్రేషన్స్, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ తో పాటు కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ కి కూడా ప్రత్యక్ష సాక్షి.
ఏదైనా కార్యక్రమానికి , పనికి వెళుతున్నప్పుడు మా సిద్ధి వినాయకుడిని పూజించుకుని వెళితే పనులు సానుకూలంగా సాగుతాయని మా అందరి ప్రగాఢ నమ్మకం. మందిరం ముందు కుండా వెళుతున్న ప్రతిసారి పెద్దవాళ్లు, చిన్నవాళ్లు - స్కూల్ కి కాలేజీలకి వెళ్లే విద్యార్థులు , ఆఫీసులకు వెళ్లేవాళ్లు అలాగే తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా వినాయకుడిని చూసి చేతులతో నమస్కరించి, కొందరైతే వినాయకుడిని గుండెల మీద ఊహిస్తూ ముట్టుకుంటూ, మరికొందరైతే ముద్దు వస్తాడేమో వేళ్ళు మూతి మీద పెట్టుకుంటూ తమ భక్తిని ప్రదర్శిస్తూ వెళ్తూ- వస్తూ ఉంటారు.
ఏ అపార్ట్మెంట్ కి లేనట్టుగా మా అపార్ట్మెంట్ కి నాలుగు దిక్కుల నాలుగు గేట్లు ఉంటాయి (పేరుకి). అవి సరిపోవు అన్నట్టుగా సూపర్ సీనియర్ సిటిజన్స్ ఈశాన్యపు దిక్కులో కూడా గేటు ఓపెనింగ్ కి జాగా ఉన్నది అని దాన్ని కూడా వాడుకుందాం అని అత్యాశకు లోనయ్యారు. అంతే రెండేళ్ల క్రితం పడమటి గేటు కి అడ్డంగా ఒక చిన్న గది కట్టేశారు పక్క సైట్లో వాళ్ళు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి మేము చాలా వినమ్రతతో ఇంగ్లీషు, కన్నడ, హిందీ భాషలో మాట్లాడుతుంటే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న డాక్టర్ శంకర్ దాదా మాత్రం పోలీసుల దగ్గరికి వెళ్లి మా ఎదురుగానే కన్నడ ,తెలుగులో అసభ్య సమాజానికి అలవాటైన భాషలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వెళ్లిపోయాడు. అతను నిజంగానే ప్రాక్టీస్ చేయని డొనేషన్ డాక్టర్ కమ్ దాదా. అంతకు రెండేళ్లు ముందే ఉత్తరపు దిక్కు గేటు పక్కనే ఉండే గూండా దారికి అడ్డంకులు పెట్టి గొడవ చేసేవాడు. అతను అర్ధాంతరంగా ఊర్ధ్వ లోకాలకు వెళ్ళగా - ఆ గూండా గిరి వారసత్వంగా పుణికి పుచ్చుకున్న ఆయన సతీమణి (గూండి) గేటుకి అడ్డంగా సగం గోడ కట్టేసింది. నాలుగు చక్రాల బళ్ళు వెళ్లాల్సిన ప్లేసులో మాకు రెండు చక్రాల బళ్ళకే సందు ఉంది.
ఇక దక్షిణపు గేటు భారత్ పాకిస్తాన్ల సరిహద్దులాగా ఇనుప కంచెలతో కట్టబడి నడవటానికి మాత్రం దారి ఉంటుంది. ఇది మా దాయాదుల అపార్ట్మెంట్ కి మాకు ఎల్ ఓ సి లాంటిది. ఒక్కోసారి కాల్పులు (తగాదాలు) జరుపుకోవటము తర్వాత వెనువెంటనే కాల్పుల విరమణ అంగీకరానికి వచ్చి యధాస్థితి కొనసాగించడం జరుగుతుంటుంది. ఇక మాకు మిగిలింది మా సిద్ధి వినాయకుడు చూసే తూర్పు దిక్కు ఒకటే. మా అపార్ట్మెంట్ పరిస్థితి కూడా భారతదేశ పరిస్థితి లాగానే ఉంది (హోస్టైల్ నైబర్స్ తో). ఇన్ని గేట్లలో తగాదాలు ఉన్నా ఏనాడు మేము ఈ గేట్ల సమస్య పరిష్కరించమని వినాయకుడి గుడి గేటు తట్టలేదు. ప్రతి రిపబ్లిక్ డే - ఇండిపెండెన్స్ డే కి మాత్రం గుడి పక్కనే త్రివర్ణ పతాకమును ఎగురవేసి దేశం బాగుపడాలి, బయటి - లోపలి టెర్రరిస్టుల నుంచి రాజకీయ నిరుద్యోగుల నుంచి దేశాన్ని కాపాడాలని కోరుకుంటాం.
మా సిద్ధి వినాయకుడు అశుభాలకు కూడా మౌన సాక్షిగా నిలిచాడు. వయసు మీరి వెళ్లిపోయిన పెద్దవారికి చివరి విడ్కోలే కాకుండా తన ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఆక్వా యోగా చేస్తూ సమాధి స్థితిలో ఉండి అలాగే జల సమాధి అయిపోయిన 15 ఏళ్ల బాలుడి మరణానికి కూడా నిశ్శబ్ద సాక్షిగా మిగిలాడు. టెంపుల్ కి ట్రస్టీలాగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి తండ్రి బాలుడి మరణంతో ఉగ్ర శంకరుడిలాగా మారి అప్పటినుంచి మందిరం వైపే చూడకుండా , చివరికి సొంత అపార్ట్మెంట్ కూడా అద్దెకిచ్చేసి బయటికి వెళ్లి పోయేదాకా సాక్షిగానే మిగిలాడు మా గణపతి.
ఎక్కడెక్కడో ఉన్న దేవాలయాలని, దేవుళ్ళని చూడటానికి సుదూర తీర్థయాత్రలు చేస్తుంటాము, కానీ మన పక్కనే ఉన్న వీధి దేవుళ్ళని విస్మరిస్తుంటాము - వాళ్ళని తప్పకుండా తరచుగా దర్శించుకోవాలని చాగంటి గారు చెప్పిన దానిని గత మూడేళ్ల నుంచి క్రమం తప్పకుండా పాటిస్తూ మా సిద్ధి వినాయకుడిని ప్రతిరోజు దర్శించుకుని ఆ తరువాతే మా గత రెండేళ్ల భారత తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టాము🙏
చంద్రశేఖర్ చన్నాప్రగడ
బెంగళూరు
24-ఆగస్ట్-2025


No comments:
Post a Comment