Saturday, December 20, 2025

గీత - మా ఇంటి ఒక మంచి పని మనిషి

 


 

గీత - మా ఇంటి ఒక మంచి పని మనిషి


పనిమనిషి అంటే బాగుండదేమో! కానీ సరైన అర్థం  రావాలంటే అదే వాడాలని ఆ పదం వాడుతున్నాను. లేకపోతే ఇంగ్లీషులో లాగా డొమెస్టిక్ హెల్పర్  అని అనవచ్చు.  దాని కన్నా మా అన్నయ్యలు చిన్నప్పుడు పనిమనిషికి పెట్టిన పేరు పీఎం , కాస్త దర్జాగా ఉంటుంది. (మా చిన్నప్పుడు బట్టలు ఉతకడానికి  ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. సీఎం.  అంటే చాకలి మనిషి)  

ఇంతకీ నేను చెప్పిన ఈ గీత మాకు గత మూడేళ్ల నుంచి పనిచేస్తున్నది. మా అపార్ట్మెంట్ ఉమ్మడి కుటుంబాలకి దశాబ్ద కాలం పైనుంచి చేస్తోంది.  కాబట్టి అప్పటి నుంచే మాకు తెలుసు. మా జీవితాలు గీత ముందు ఒక  లాగా గీత చేరిన తర్వాత ఇంకొక లాగా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


నాకు ఊహ తెలిసినప్పటినుంచి  పది పదిహేను మంది పని మనుషులను చూశాను. అందరూ కటిక దరిద్రంలోనో లేక పేదరికంలోనో జీవిస్తుండే వాళ్లే. 

ఒరిస్సా లోని సునాబేడ - కాశ్మీర్ ఆఫ్ ఒరిస్సా (ఆంధ్ర అరకు ఇటువైపు, ఒరిస్సా సునబేడ ఇంకొక వైపు అన్నమాట) లో నేను ఏడు ఏళ్లు ఉన్నప్పుడు  పని మనుషులు  అందరూ పక్కనే ఉన్న కొండల (భాలు పహాడ్) నుంచి వచ్చి టౌన్ షిప్ లో పనిచేసే ఆదివాసీలే. కొత్తగా చేరినప్పుడు నేను వాళ్లకి కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వబోతుంటే మా పక్కింటి ఆంటీ అన్నారు 'వాళ్లకి నువ్వెంత డబ్బులిచ్చినా ఆనందం ఉండదు. అదే వాళ్లకి పనిలోకి రాంగానే అన్నం పెట్టి పనంత అయ్యాక కుటుంబానికి సరిపడే అన్నం ఇస్తే ఎంతో ఆప్యాయతగా చూసుకుంటారని'. దానికి తగ్గట్టుగానే మొదట్లో ఒకళ్ళిద్దరు పని మనుషులు మానేస్తే, ఇంత డబ్బులు ఇచ్చినా ఎందుకు మానేస్తున్నారబ్బా! అని ఆశ్చర్యపోయేవాడిని.  తర్వాత తెలిసింది డబ్బు కన్నా వాళ్ళకి అన్నం చాలా ముఖ్యమని.

తర్వాత బెంగళూరులో రకరకాల పనిమనిషిలు. అందరూ పేదవాళ్ళె. తాగుబోతు భర్తలు, తాగి వచ్చి పెళ్ళాలని కొట్టే భర్తలు కలవాళ్ళే. ఇలా మా పనిమనుషుల ఆర్థిక ,మానసిక, శారీరిక కష్టాలు మా దినచర్యలో భాగంగా మారి మాకెంతో మానసిక ఒత్తిళ్లుగా తయారయ్యాయి. 

ఒక పనిమనిషి కుటుంబాన్ని ఉద్ధరిద్దామని వాళ్ల పిల్లలకి స్కూలు ఫీజులు కట్టి, కనీసం మీరు పి.యు.సి  పాస్ అయితే ఏదో ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని చెప్పినా వినకుండా వాళ్లు స్కూళ్లు మానేసి పని పిల్లలగా జేరి లేదా టీ షాపులు నడుపుతూ లేదా పళ్ళ బండ్లు ఎండల్లో చూసుకుంటూ, తోసుకుంటూ జీవితాన్ని గడిపే వాళ్ళు.  ఇంకొక పని మనిషి - కొడుకు, కోడలు బయటికి పంపేస్తే కూతురు మనవళ్లను చూసుకుంటూ ముసలితనంలో కూడా పాపం పనులు చేసేది. 


అలాంటి మా కష్టాలని ఆదుకోవడానికి అన్నట్లు మూడేళ్ల కిందట- అదిగో ఆ గీత మా ఇంట్లో పనిమనిషిగా చేరింది. అన్నా, అక్క అని భార్యాభర్తలని కలిపి పిలవగలిగే హక్కు ఒక్క పని మనిషికి మాత్రమే ఉంది కదా. దానికి తగ్గట్టుగానే రోజుకి కొన్ని వందల సార్లు - అన్నా , అక్క అని పిలుస్తునే  ఉంటుంది.  సొంత తోబుట్టువులు కూడా అంత ప్రేమగా పిలవరేమో.  

గీత పేరుకే పనిమనిషి. కానీ మూడు అంతస్తుల చిన్న ఇల్లు సొంతంగా కట్టుకుంది, ఒక సైటు ఉంది. పిల్ల పెళ్ళికని  బంగారపు నగలు, వెండి వస్తువులు ఎప్పుడో కొనిపెట్టుకున్నది.  ఒక దశలో తన సంపాదన,  మొగుడి సంపాదన, కూతురు (బి.సి.ఎ చదివి కాల్ సెంటర్లో జాబ్ ),  కొడుకు సంపాదన, ఇంటి అద్దెలు కలిపి దాదాపు లక్ష ఆదాయం ఉండేది. ఇంట్లో కూడా గీతదే డామినేషన్.

గీతం మంచి హెల్త్  కాన్షియస్ కూడా. ప్రతి సంవత్సరం యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకుంటుంది. ఏమాత్రం తేడా ఉన్న మందులు వాడుతుంది.  మూలపడితే ఎవరు చూస్తారు  అంటుంది.


గీత దగ్గర  నేర్చుకోవాల్సిన  విషయాలు.

ఒకటి - గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు, ఫ్రీ పవర్, రేషను, పేదరికపు పింఛను... ఇవి తప్పకుండా తీసుకోవాలి. ఇదేమి సిద్ధరామయ్య సొంత డబ్బు కాదు కదా. మన ప్రజల సొమ్ము మాకు ఇస్తున్నాడు అంటుంది. దానికి కావలసిన కాగితాలు సర్టిఫికెట్లు ఆఫీసుల చుట్టూ తిరిగి సంపాదించుకుంది. అలా అని ఫ్రీగా బస్సు ఉంది కదా అని ఊరికే  అసలు తిరగదు.  ఆ ఫ్రీ బస్సు తోపాటు మిగతా ఖర్చులు కూడా  పెరుగుతాయి అని భయం.

రెండు- లవ్ యువర్ వర్క్.  తన పని చక్కగా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ నసగకుండా ఇంకా ఎక్కువ పనులు చేస్తూ హుషారుగా ఉంటుంది. ఇల్లు చిమ్మేటప్పుడు నిలువు గీత (ఒళ్ళు వంగకుండా), తడిగుడ్డతో ఇల్లు అలికేటప్పుడు అడ్డగీత (పూర్తిగా నేల మీద పడిపోయి) లా మారిపోతుంటుంది. 'అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం' అని రోజు విడిచి రోజు అంటుంటుంది.  జయ మీద ప్రేమ చూపడంలో  గీత నాకు కాంపిటీషన్ గా మారింది.

మూడు- డిసిప్లిన్. ప్రొద్దున, సాయంత్రం క్రమం తప్పకుండా పనిలోకి వస్తూ - ఒక్కరోజు  నాగా పెట్టడానికి  కూడా సంశయిస్తుంది. ఊరికే సెలవు పెట్టి గొడ్డులా తిని తొంగుంటే ఏం లాభం అంటుంది. ఎప్పుడైనా ఒకరోజు రాకపోతే మాకు వార్నింగ్ ఇస్తుంది. సామాన్లు అలాగే ఉంచండి. రేపు వచ్చి తోముతాను అంటుంది. ఒకవేళ మీరే తోముకుంటే ఇక మీ ఇల్లు మానేస్తానని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. పని రాక్షసి.

నాలుగు - డబ్బులు అవసరం ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న చీటీ డబ్బులను తీయదు. వడ్డి డబ్బులు వేస్ట్ ఎందుకని.  అందుకని పని చేసే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది. ఇంటరెస్ట్ ఫ్రీ లోన్. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్.

ఐదు - వర్క్ మోర్ డిమాండ్ మోర్.  ఇదేదో వర్కర్స్ యూనియన్ స్లోగన్ లాగా ఉంది కదా. అవును. ఏ పనికీ తగ్గదు. కానీ దానికి తగ్గట్టుగానే జీతం, బోనస్సులు డిమాండ్ చేస్తుంది. కానీ చాలా నిజాయితీపరురాలు, నమ్మకస్తురాలు.


గీతకి పాలిటిక్స్ ఒక ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటి.  బిజెపికి గత రెండు దశాబ్దాలుగా  విశ్వాసమైన నికార్శైన కార్యకర్త.  20 ఏళ్లుగా మా వార్డు, అసెంబ్లీ , పార్లమెంటు నియోజకవర్గాల్లో బిజెపినే గెలుస్తోందంటే గీత వంతు ఎంతో ఉంది.  ఎలక్షన్లప్పుడు ఒకటి నుంచి రెండు వారాల వరకు తీవ్రంగా క్యాంపెయిన్ చేస్తుంది. కార్పొరేషన్, స్టేట్ అసెంబ్లీ, లోక్ సభ ఇలా సంవత్సరానికి ఒకటి చొప్పున మూడు సంవత్సరాలు వరసగా క్యాంపెయిన్ లో  పాల్గొంటుంది.  ఊరికే కాదు సుమా! రోజుకి 500 నుంచి 1000 రూపాయల దాకా ఇస్తారు.  పని తొందరగా కానిచ్చి కాన్వాసింగ్ లోకి వెళ్తుంది. ప్రచార మెంబర్  స్థాయి నుంచి ప్రచార లీడర్ స్థాయి దాకా ఎదిగింది.  మా  సతీష్ అన్న, సూర్య బాబు అంటూ ఎమ్మెల్యే, ఎంపీల గురించి మాట్లాడుతుంది.  వాళ్ళు గెలిచినప్పుడో , పుట్టినరోజు అప్పుడో సామూహిక విందులకి వెళుతుండేది. నాకు మా గీతకి సిద్దు-మోడీ మీద డిస్కషన్స్ చాలానే జరుగుతుంటాయి.  ఉచితాలకి బాగానే అలవాటు పడ్డది కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కమలానికి చెయ్యి ఇచ్చి - సిద్దుకి ఓటు వేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మోడీని మాత్రం దేవుడని, వదలనని, ఢిల్లీ ఓటు మాత్రం కమలంకే అంటుంది మరి. 


ఇప్పుడు గీత కూతురు పెళ్లి అంగరంగంగా జరుగుతోంది.  పెళ్లికి వేరే ఊళ్ళల్లో ఉన్న మా అన్నయ్యలని కూడా పిలిచింది ఫోన్ చేసి మరి - ఇక్కడ వాళ్ల పిల్లల ఇంట్లో కూడా పని చేస్తుంది కాబట్టి.  ఒక నెల నుంచి మా ఇంట్లో పొద్దున,  సాయంత్రం పెళ్లి కబుర్లే మా ఇంట్లో పెళ్లి లాగానే. పెళ్ళికి ఖర్చు దాదాపు 20 లక్షలు పైనే. చీటీ డబ్బులు తీస్తే ఇంట్రెస్ట్ వేస్ట్ కాబట్టి పని చేస్తున్న ఇళ్ల వాళ్ళ నుంచి లక్షలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గా తీసుకుంది. మూడు గంటల ప్రయాణం తరువాత పెళ్లి జరుగుతున్న ప్లేస్ కి వెళ్లాము.  పెళ్లి కొడుకు వాళ్ళ ఊళ్లో జరుగుతున్న భారీ రిసెప్షన్ కి (దాదాపు 1000    మంది గ్యాదరింగ్) అటెండ్ అయ్యాము.  రాబోయే ఆదివారం బెంగళూరులో ముక్కతో ప్రత్యేకమైన విందు భోజనం. మాలాంటి సాంబార్ ములక్కాయల ముక్కల బ్యాచ్ కి మాత్రం రిసెప్షన్ లోనే భర్జరి ఊట (ఒబ్బట్టు, ప్రత్యేక ముళ్ బాగల్ దోశ...). 

గత నెల నుంచి గీత శోకాలు పెడుతున్నది.  పాతిక ఏళ్లు పెంచిన తన అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోతోంది అని.  పెళ్ళిలో కూడా కన్నీటితోనే ఉన్నది.  ఇక అప్పగింతల కార్యక్రమం అప్పుడు మొంథ తుఫానుకు మించిన వరదలే రావచ్చు.

ఇప్పటివరకు మా రోజు వారి బాతాఖానిలో గీత తన పెనిమిటి, ఆడ బిడ్డ , కొడుకు విషయాలు తెగ చెబుతూ ఉండేది. ఇప్పుడు ఇక ఆ  బాతాఖానిలోకి కొత్త అల్లుడు కూడా చేరబోతున్నాడు. ప్రస్తుతానికి ఈ గీతా పారాయణానికి ఇంతటితో ముగింపు పలుకుదాం. 

 

చంద్రశేఖర్ చన్నాప్రగడ 

బెంగళూరు

31-అక్టోబర్-2025

No comments:

Post a Comment