Friday, November 20, 2026

US Tit Bits: అగ్రరాజ్యంలో దేశీ ముచ్చట్లు! - (కాలక్షేపపు బఠాణీలు)

 


US Tit Bits: అగ్రరాజ్యంలో దేశీ ముచ్చట్లు!

(కాలక్షేపపు బఠాణీలు)

ఉపోద్ఘాతం:
ఇది పూర్తిగా నా దృష్టికోణంలో రాసిన సరదా వ్యాసం. కొంతమందికి ఇది తప్పుగానో, ఎబ్బెట్టుగానో, కాస్త అతిగానో అనిపించవచ్చు. అది వారి విజ్ఞతకే వదిలేస్తూ… ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే ముందుగానే క్షంతవ్యుడిని! 

నేను ఇంతకుముందు కూడా అమెరికా వెళ్లాను, యూరప్ దేశాలు తిరిగాను. కానీ అవన్నీ అఫీషియల్ ట్రిప్పులు. ప్రాజెక్ట్ వర్క్ కు బిజినెస్ పని పైన వెళ్లటం జరిగింది. వెళ్లిన ప్రతిసారీ ఆ దేశంలోని వింతలు విశేషాలు, మనుషులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంస్కృతి, చరిత్ర గురించి డైరీ రాసేవాడిని. మూడు దశాబ్దాల కిందట మొట్టమొదటిసారి బ్రిటిష్ వారి లండన్ గడ్డపై అడుగుపెట్టినప్పుడు ఏదో చంద్రశేఖర్ ఆజాద్ లాగానో, సర్దార్ ఉధమ్ సింగ్ లాగానో ఫీలయ్యాను! అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ గారు జైలు నుంచి ఇందిరా గాంధీకి ఉత్తరాలు రాసినట్లు, నేను ప్రతివారం మా మూడేళ్ల అబ్బాయికి "Letters from a Father to His Son" పేరుతో ఉత్తరాలు రాసేవాడిని.

రెండు వారాల పని కని బిజినెస్ వీసా తీసుకుని, ఆఫీసులో నాలుగు వారాలని చెప్పి నన్ను లండన్ పంపారు. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది అది సరిగ్గా ఆరు నెలల పని అని! కస్టమర్ 'బ్రిటిష్ ఎయిర్‌వేస్' ఎక్స్‌పెక్టేషన్ కూడా అదే. అలా బిజినెస్ వీసా మీద ఆరు నెలల పాటు పనిచేసిన అతికొద్ది మంది మొట్టమొదటి భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో నేను ఒకడిని. ఆ తర్వాత కూడా మూడు నెలలు, ఒక నెల చొప్పున వెళ్ళి వచ్చాను. అప్పట్లో బిజినెస్ వీసా నిబంధనలను ఘనంగా ఉల్లంఘించిన కంపెనీలలో మాది కూడా ఒకటి! పని ఒత్తిడి వల్ల వారాంతాల్లో 'గుడు గుడు గుంజం' లాగా లండన్ చుట్టుపక్కలే తిరగాల్సి వచ్చేది. తిరిగి ఇండియా వచ్చాక, 'ఇంద్ర' సినిమాలో చిరంజీవి లాగా నేలని ముద్దాడకపోయినా, ఏదో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వీరుడిలా ఫీల్ అవుతూ తిరిగి వచ్చాను.

డాలర్ డ్రామాలు:
మొన్న వెళ్లిన అమెరికా పర్యటన (వెస్ట్ కోస్ట్, శాన్ హోసె) పూర్తిగా వ్యక్తిగతం కావడంతో చాలా హాయిగా గడిచింది. పనీపాటా లేక బలాదూర్ గా తిరగడానికి వెళ్ళినట్లు అనిపించింది. చాలామంది తల్లిదండ్రులు కూతురిదో, కోడలిదో డెలివరీ కోసమో, బేబీ సిట్టింగ్ డ్యూటీల కోసమో వెళ్తుంటారు. మా అదృష్టం కొద్దో, దురదృష్టం కొద్దో ఆ డ్యూటీ మాకు పడలేదు.

మా మేనబావ ఒకతను తరచూ అమెరికా వెళ్తుంటాడు. వాళ్ల, వాళ్ల తోబుట్టువుల పిల్లలంతా అక్కడే స్థిరపడ్డారు. తల్లిదండ్రులు సగం రోజులు ఇక్కడ, సగం రోజులు అక్కడ ఉంటారు. వాళ్ళ కరెన్సీ డాలర్; మోదీ-రా.గాం వాళ్ళకి ఆనరు — యూఎస్ ఎన్నికలు, రాజకీయాలే వాళ్ళ హాట్ టాపిక్స్!. (భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు అమెరికాలో పుట్టాల్సిన వాళ్లు తృటిలో తప్పిపోయి ఇండియాలో పుట్టారు). అతనికి వాళ్ళ పిల్లలు ముందే వార్నింగ్ ఇచ్చారట: "నాన్న! ఇక్కడ ఆడవాళ్ళ వస్త్రధారణ చూసి తబ్బిబ్బయ్యో, మురిసిపోయో అదేపనిగా చూడమాకు. అది అనాగరికమే కాదు, వాళ్ళు కేసు కూడా పెట్టవచ్చు" అని! ఇక తల్లులకేమో "అమ్మా! ఇక్కడ పిల్లల్ని చూసి జాంపండు లాగా ఉన్నారని 'చి చీ కన్నా' అంటూ బుగ్గలు గిల్లడం, నిమరడం ఫోటోలు తీయడం అస్సలు చేయకు" అని హెచ్చరిక. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, వాళ్ళు సొంత పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించే  శునకాలను కూడా కళ్ళప్పగించి చూడకూడదని, ఫోటోలు తీయకూడదని 'స్టాట్యూటరీ వార్నింగ్' ఇస్తారు. అమెరికాలో వీధి కుక్కలు ఉండవు. ఇక పెంపుడు శునకాలకు జరిగే రాజభోగాలు సుఖభోగాల సేవ మన ఇండియాలో పిల్లలకు కూడా జరగవంటే అతిశయోక్తి కాదు!

అమెరికా వెళ్ళిన మొదటి వారం పది రోజులు ప్రతీదీ డాలర్ నుంచి రూపాయల్లోకి లెక్కేసుకుని "అమ్మో ఇంత రేటా!" అని బెంబేలెత్తిపోతాం. 90వ దశకంలో డాలర్ రూ.35, 2000లో రూ.45 ఉండేది. అప్పట్లో గుణకారం (Multiplication) కష్టంగా ఉండేది. కానీ నిర్మలమ్మ పుణ్యమా అని ఇప్పుడు ఆ కష్టం లేకుండా పోయింది! డాలర్ రేటు పక్కన రెండు సున్నాలు చేర్చేస్తే చాలు, హాయిగా మన రూపాయల విలువ తెలిసిపోతుంది. కొన్ని రోజులు గడిచాక సత్యము బోధపడి, అమెరికా కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, మన బెంగళూరు వేరు అని సర్దుకుంటాం. చివరి వారానికి వచ్చేసరికి 'బ్రహ్మజ్ఞానం' కలిగి "ఏ రేటైతే ఏమిట్లే" అని గిఫ్టులు, చాక్లెట్లు కొనేసి ఇండియాకి వచ్చేస్తాం. ఇక ఇండియాలో దిగగానే రివర్స్ గేర్ మొదలవుతుంది! మొదటి పది రోజులు ఇక్కడి రేట్లు చూసి "అబ్బ ఎంత చీప్! కేజీ బియ్యం ఒక్క డాలర్ మాత్రమేనా!" అని సంబరపడిపోతాం. జెట్ ల్యాగ్, ఆ డాలర్ హ్యాంగోవర్ దిగాక అసలు వాస్తవికతలోకి వచ్చి "అయ్యబాబోయ్ ఇంత ఖరీదా!" అని గొంతు చించుకుంటాం.

గ్రానీస్ క్రెష్ - మనవళ్ల ఆలన:
అక్కడ ప్రతి అపార్ట్‌మెంట్‌కు / ఏరియకు దగ్గర్లో ఒక కమ్యూనిటీ పార్కు ఉంటుంది. బెంగళూరుని చూసి "అబ్బ ఇన్ని పార్కులా" అని ఆశ్చర్యపోయే నాకు, అక్కడి విశాలమైన పార్కులు, పిల్లల ఆట స్థలాలు, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు, డ్రింకింగ్ వాటర్ కుళాయిలు చూస్తే భలే ముచ్చటేసింది. (కాకపోతే అక్కడి శౌచాలయాలు మాత్రం పరమగబ్బు!). 

సాయంత్రం ఐదు, ఆరు గంటలవ్వగానే సీనియర్ సిటిజన్స్ అంతా పార్కులో వాలిపోతారు. అందులో 90% భారతీయులే! నేను, జయ నడుస్తూ మాకు వచ్చిన కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలన్నీ కలిపి మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడి సీనియర్ మోస్ట్ సిటిజన్స్ మాది ఏ భాషో తెలియక మొదట్లో తికమక పడ్డారు. తర్వాత ఒక కన్నడ పెద్దాయన  "ಬನ್ನಿ ನಮ್ಮ ಜನ ಎಲ್ಲ ಇಲ್ಲಿದ್ದಾರೆ" (రండి, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు) అని పిలిచాడు. తెలుగు వాళ్ళేమో "మీరు కన్నడ వాళ్లతో మాట్లాడుతుంటే మీరు కూడా బెంగళూరు కన్నడ వాళ్ళనుకున్నామండీ రండి కూర్చుందాం" అని పలకరింపు.

అక్కడ వాళ్లు నడవడం కన్నా కూర్చుని కబుర్లు చెప్పుకోవడమే ఎక్కువ. "మా అబ్బాయి, కోడలు / కూతురు అల్లుడు ఆఫీస్ పని ముగించుకుని పిల్లల్ని చూసుకుంటున్నారు, అందుకే మాకు ఇలా కాసేపు బయటకు రావడానికి టైమ్ దొరికింది" అనేది అక్కడ కామన్‌గా వినిపించే డైలాగ్. వీళ్ళ రాజకీయ చర్చలు మాత్రం రాష్ట్ర స్థాయి దాటవు! కన్నడ వాళ్ళయితే బెంగళూరు ట్రాఫిక్, సిద్దు-డీకేశిల మీద ఫిర్యాదులు; తెలుగు వాళ్ళయితే చంద్రబాబు, జగన్, పవన్ మీద చర్చలు. ఒక్క హిందీ వాళ్ళు మాత్రమే జాతీయ రాజకీయాలు మాట్లాడుతుంటారు. అయితే, వీళ్ళందరికీ ఉండే కామన్ టాపిక్స్ మాత్రం పెద్దాయన ట్రంప్, I-140, గ్రీన్ కార్డ్, H4-EAD కష్టాలు! ఇందులో కొంత మంది ప్రతి సంవత్సరం చొప్పున 15 నుంచి 20 దాకా యూఎస్ ట్రిప్పులు క్రమం తప్పకుండా వేసిన వాళ్లే ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ అన్నమాట.

ఇంకో పక్కన 'మహిళా మండలి' ఉంటుంది. మొదట్లో క్లబ్ హౌస్ గదిలో కూర్చుని భక్తి గీతాలు పాడుకునేవారు. తర్వాత పర్మిషన్ పోయేసరికి ఆరుబయట కూర్చునే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా అందుకున్నారు. సామవేదం గారు, గరికపాటి గారు కనుక వీళ్ళ అపభ్రంశపు శ్లోకాలు విన్నారంటే తల బాదుకుంటూ "తల్లులారా! దయచేసి నోరు మూసుకుని కూర్చోండి. అదే బోలెడు పుణ్యం మీకూ సమాజానికి" అంటారు ఖాయంగా! అయినా పరాయి దేశంలో ఎవరి ఇంట్లో వాళ్ళు లేదా ఏదైనా హాలులో కానీ గుట్టుచప్పుడు కాకుండా భజన చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా బహిరంగంగా చేస్తే తెల్లవాళ్ళకి కాస్త వింతగా, తిక్కగానే  అనిపిస్తుంది. ఇక సౌత్ సెంట్రల్ అమెరికాలోని 'డల్లాస్ పురం' ,'జై బాలయ్య' ఊరేగింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది!

అమెరికా అద్భుతః
ఎంతైనా న్యూస్ వాళ్ళం కాబట్టి అపార్ట్‌మెంట్ చుట్టుపక్కల అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళం. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని తిరిగేసి ల్యాండ్ మార్కులన్నీ గుర్తు పెట్టుకునే వాళ్ళం. అక్కడ ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. యూవీ (UV) కిరణాల ప్రభావం ఎక్కువ కాబట్టి త్వరగా డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కి రోజు విడిచి రోజు వెళ్ళడం మా 'ద్విదినచర్య'! 'ఫైవ్ స్పైస్' స్టోర్ వాడు ఇచ్చే ఫ్రీ టీ తాగి, బిస్కెట్లు తిని, చిన్నప్పుడు మా తెనాలిలో శెట్టి గారి షాపు దగ్గర రోజువారి కూలీలు ఒక కూర, నారా, బియ్యం, పప్పు కొనుక్కున్నట్లు — మేము కూడా రెండు మూడు కూరలు, పాలు, పెరుగు కొనుక్కుని టైంపాస్ చేసేవాళ్ళం.

మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు "అమెరికాలోని బాత్రూములు మన ఇండియాలోని డ్రాయింగ్ రూములు, రోడ్ల కన్నా బాగుంటాయి" అని ఎప్పుడో అన్నారు. దానిమీద నో కామెంట్స్ కానీ, వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే! కొన్ని దశాబ్దాల క్రితమే భవిష్యత్తు ట్రాఫిక్‌ను ఊహించి అంత వెడల్పుతో ఫ్రీ-వేలు, ఎక్స్‌ప్రెస్-వేలు నిర్మించడం గ్రేట్. నాలుగు లేన్ల రోడ్డులో ఎగ్జిట్ అవ్వడానికి కార్లన్నీ క్రమశిక్షణతో క్యూ కట్టడం, ఎవరూ లెఫ్ట్ నుంచి వచ్చి మధ్యలో దూరకపోవడం చూస్తే ముచ్చటేస్తుంది. ఎక్కడైనా ఒకటి రెండు రూల్ బ్రేకింగ్ కేసులు కనిపించాయంటే, 90% అది మన దేశీయుల ఘనకార్యమే అయి ఉంటుంది!

మా నెఫ్యూ అయితే టెస్లాలో ఆటో-డ్రైవ్ పెట్టేసి, సీట్లో బాసింపట్ట వేసుకుని ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పని చేసుకుంటూ హాయిగా వెళ్ళొచ్చు అంటాడు. మేము కూడా డ్రైవర్ లేని 'వేమో' (Waymo) కారులో ప్రయాణించాము. అమెరికా విశాలమైన రోడ్లకు తగినట్లుగా దీన్ని అద్భుతంగా రూపొందించారు.

విహార విన్యాసాలు - ఆత్మీయ సమ్మేళనాలు:
మా అబ్బాయికి రెండు మూడేళ్లు ఉన్నప్పుడు, నేను ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తానా అని కిటికీ చువ్వలు పట్టుకుని వేలాడుతూ ఎదురుచూసేవాడు. రాగానే ఎగిరి గంతులు వేసేవాడు. ఇప్పుడు వాడు ఆఫీస్ నుంచి వచ్చి, జిమ్, రన్నింగ్ అన్నీ ముగించుకున్నాక ఓపిక ఉంటే మమ్మల్ని షాపింగ్‌కో, మాల్‌కో, పార్కుకో తీసుకెళ్లేవాడు. ఓపిక లేకపోతే "ఈరోజు వద్దు" అనేవాడు. చిన్నప్పుడు వాడు "ఈ పెద్దోళ్ళు ఉన్నారే…" అని ఎలా అనుకుని ఉంటాడో, ఇప్పుడు మేము "ఈ కుర్రోళ్ళు ఉన్నారే…" అని అనుకుంటుంటాం 

మధ్యలో ఒక పది రోజుల పాటు పసిఫిక్ (పశ్చిమ) తీరం నుంచి అట్లాంటిక్ (తూర్పు) తీరానికి ట్రిప్ వేశాం. అక్కడ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ, పాత రాజధాని ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, బిజినెస్ క్యాపిటల్ న్యూయార్క్ చుట్టేశాం. రెండు తీరాల్లోనూ మా బీటెక్, ఎంటెక్ ఫ్రెండ్స్‌ని, కజిన్స్‌ని, నెఫ్యూలు, నీసులను కలిశాం. 

బే ఏరియాలో ఒక రాయి విసిరితే అది కచ్చితంగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కే తగులుతుంది — అందులోనూ 90% మన భారతీయులే! నా వయస్సు వాళ్ళు, అంటే అరవై దాటిన వాళ్ళంతా దాదాపుగా ' వైటూకే' (Y2K) సమయంలో అమెరికా వెళ్లినవాళ్ళే. అందరూ అమెరికన్ సీనియర్ సిటిజన్స్ అయిపోయినా, ఇంకా భారతీయతను, సంస్కృతిని వదలకుండా పట్టుకుని వేలాడుతున్నారు. "మేము ఇండియన్సే" అని గర్వంగా చెప్పుకుంటారు. మరి వాళ్ళ పిల్లలు మాత్రం 'మగ' (MAGA) లో భాగమైపోయి అమెరికా అభివృద్ధికి తోడ్పడుతున్నారు! మరికొందరు మాత్రం "న అమెరికా కా… న ఇండియా కా…" అన్నట్లు ఉన్నారు.

అక్కడ ఒకే ఏరియాలోనే చాలా దేవాలయాలు ఉంటాయి. బెంగళూరు కన్నా ఘనంగా సంకష్టహర చతుర్థి చేసే ఫ్రీమాంట్ సిద్ధి వినాయక మందిరం, శాన్ హోసెలో కృష్ణాష్టమి వైభవంగా చేసే ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్, ఉత్తర భారతీయ పద్ధతిలో రాధాకృష్ణ టెంపుల్, మన తెలుగువారి బాలాజీ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి దసరా సమయంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి పార్కులలో బతుకమ్మ పండుగలు కుప్పలుతెప్పలుగా  చేస్తున్నారు. ఉత్తరాది తరహా కోలాటం, తమిళ-కన్నడ తరహా  గోలులు కోకొల్లలు.

అర్థాంతర ముగింపు:
రెండేళ్ల కిందట అమెరికా వెళ్ళినప్పుడు దగ్గరుండి ట్రంప్ క్యాంపెయిన్ నడిపించి గెలిపించాము. ఈసారి మిడ్-టర్మ్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ తారాస్థాయికి చేరే సమయానికి దగ్గరుండి..... 

అందరూ " రెండు నెలలకే వెళ్ళిపోతున్నారా? ఆరు నెలలు ఉండొచ్చుగా!" అని అడిగేవారు. "అమ్మో! మా అమ్మాయిని బెంగళూరులో ఒక్కదాన్ని వదిలేసి వచ్చాము పాపం, వెళ్ళిపోవాలి!" అనేవాళ్ళం. రానుపోను ఫ్లైట్ ప్రయాణం మాత్రం బహు కష్టం సుమీ! గల్ఫ్‌లో ఎప్పుడు ఏ గొడవ వచ్చి ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో తెలియదు. ఇక లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పారిస్ లే-ఓవర్ అయితే వణుకు పుట్టింది — అది పారిస్ ఎయిర్‌పోర్టా లేక గాజా స్ట్రిప్పా అన్నట్లుంది పరిస్థితి! మొత్తానికి ఈసారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖంగా ఇంటికి చేరుకున్నాం.




Golden Gate Day - 6th Sep 2026




The US Capitol (Congress) - Washington DC        - 12th Sep 2026




BAPS Swaminarayan Akshardham - Windsor, NJ - 16th Sep 2026




Times Square - Manhattan, NYC 17th Sep 2026



Statue of Liberty - Liberty Island -18th Sep 2026



Ocean Avenue Beach - Caramel-By-The-Sea            - 3rd Oct 2026


— చంద్రశేఖర్ చన్నాప్రగడ
బెంగళూరు
20-Nov-2026





No comments:

Post a Comment